సమస్యాపూరణం part-2



ఖాద్యము మెక్కుచున్,పరుల కాంతల మేలములాడు వంకతో  
చోద్యము గాగ డాసి,తన సుందరి కెగ్గునుఁగల్గఁజేసి, యే
ఉద్యమ శక్తి లేకయె,కుయుక్తులఁబల్కుచు,మోసకారులౌ
విద్యలు, లేని మానవుడె విజ్ఞుడుగా జన మాన్యతన్ గనున్.


మద్యపు మత్తులోఁబడక,మైకము వీడి, గుణోజ్జ్వలుండునై ,
సద్యశమున్ గడించి,సుమ సదృశ మానస  వాగ్విలాసియై,
హృద్య వచోమృత ప్రకర మేర్పడ,నిత్యము వెల్గి,చెడ్డవౌ
 విద్యలు లేని మానవుడె విజ్ఞుడుగా జన మాన్యతన్ గనున్.


దేవియు సత్యభామ కడతేర్చెను దైత్యు,మదోన్మదోగ్రు, మా
యావిని,దుష్టు,నా'నరకు' నచ్చెరువంద సురల్--మహోత్సవం 
బై,విలసిల్లె--'నారి' విజయంబది--నిత్యము హర్షమిచ్చు దీ
పావళి పండుగన్ జరుపనౌఁగద పున్నమి నాటి రాతిరిన్.


చవిచెడి నీరసమును గన
నవరాత్రోత్సవములొప్పు నాలుగు దినముల్ 
కువకువ లాడుచు పిలువగ
నవ కాంతుల్  చిమ్మి యమ్మ  నయముగ రాదా!
తోడయి రాగ నిర్ధనపు, దుఃఖ,విరాగ,నిరాశ,నీడలున్ 
మాడిన నిండు జీవితము మాయని వేదనయే మిగల్చగా
జాడలు కానరాని,వినజాలని,బాధల కృంగిపోవగా  
వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁదీర్చగన్.

మోడులువారు జీవిత తమోమయ గాధలు పోల్చి చెప్పగా 
వాడిన పూవులే తగును-భామలకున్  బ్రతుకమ్మఁదీర్చగన్
పాడగ పాటలన్,బ్రతుకు పండగ,నా తెలగాణ వీధులున్ 
వీడని దివ్య కాంతుల,సుభిక్ష,సురక్ష,ల తేలియాడవే!

అంకిత భక్తి భావ సముదంచిత వీర్య పరాక్రమోద్ధతిన్  
అంకుర గర్వ దివ్య  మహితాద్భుత శౌర్య విజృంభితాత్ముడై  
పెంకె తనాన శైవు డతి భీకర రావముతోడ సర్వ నా
శంకరుడెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందగన్


సంకట దైత్యులన్ దునుమ చయ్యన శూలము నేమిఁజేసెనో?
వంకలు లేని యోగిజన వంద్యులు,తాపసు లెందునుందురో?
శంకలు వీడి దైత్య గణసంఘము పోరుకు రాగ నేమయెన్?
శంకరుడెత్తె--మంచు మల--శైలజ భీతిలి కంపమొందగన్

Comments

Popular posts from this blog

శ్రీకృష్ణదేవరాయలు