సమస్యాపూరణం -part1

తారక తాపసోత్తములు తప్పని తల్చిరి, క్రోధ, లోభ, సం
బారములన్ జితేంద్రియత; పాపపు పంకిలమంటునంచు, న
వ్వారలు షడ్వికారముల, పల్మరు రోసిరి, వాని, దోషమం
చారును(చు+ఆరును) దూరముంచిననే సాగును జీవితమద్భుతంబుగా.


మారణ హోమమాపి, తగ మంచిని పెంచుచు, తోటివారికిన్ 
కూరిమి సాయమిచ్చి, పలుకుల్ చిలుకన్ మధురంపు వాక్సుధల్ 
ధారుణిలోన పోవలయు ధార్మిక మార్గమునందునన్ - ‘దురా
-చారు’ ను దూరముంచిననె సాగును జీవితమద్భుతంబుగా     



కట్టిన తాళికి మురియుచు
బొట్టును,గాజులును,మల్లె పూలును,చీరల్
మెట్టెల నిచ్చుచు 'జే' 'జే'


కొట్టెడు పతినిష్ట పడరె కోమలులెల్లన్.


చిట్టిది,చిన్నది,కుఱ్ఱది,
బెట్టుతనంబింత లేని బేలను,పనులన్
దిట్టను,మురిపెముగన్, జో
కొట్టెడు పతి నిష్టపడరె కోమలులెల్లన్


దీనత్వంబున 'దక్షు' సన్నిధిని నార్తిం జెందెనయ్యో! ' సతి'న్
న్యూనత్వంబున  సిగ్గుఁబూనె;మదిలో నొవ్వంగ ఖేదంబుతో
ప్రాణత్యాగము సేయగా--సుఖము సంప్రాప్తించె నీ భూమికిన్
జ్ఞానానందపు శక్తి పీఠములు నాణ్యంబొప్ప దీపింపగన్.


సరస కవిత్వ తత్వ పటు సంపదఁగల్గుట భాగ్యమేఁగదా!
పరిణతిఁజూపు వారలకు భవ్య రసామృతమందకుండునే?
కరుణను భారతీసతి వికాసము పొందగ సత్య నిత్య, వా
క్కరణము నమ్మువారలకు కల్గు శుభంబులు నిశ్చయంబుగన్


సురుచిర సాహితీ మధుర సుందర పూల వనంబు చూచితిన్,
మురిపెము మీర చేరితిని;ముద్దులమూటలుఁగట్టు పద్యముల్
స్వరయుత రాగ భావముల సంతసమొప్పగ పాడ; నట్టిదౌ
కరణము నమ్మువారలకు కల్గు శుభంబులు నిశ్చయంబుగన్. 


అతులిత మహిమాన్వితుడై
సతతము దామోదరుండు సత్కృప తోడన్
గతి యగు నాకున్;లక్ష్మీ 
పతి పూజయె కార్తికమున భద్రత నొసగున్. 

స్తుతమగు తులసియు,నుసిరిక,--
హితమేఁగద 'విష్ణు 'కున్,మహీతలమందున్ 
వెతలన్ పరిమార్చు,వన
స్పతి పూజయె కార్తికమున భద్రత నొసగున్.

వనస్పతి =చెట్టు
శబ్ద రత్నాకరము 



written by:బొగ్గరం V.V.H.B.ప్రసాదరావు 

Comments

Popular posts from this blog

శ్రీకృష్ణదేవరాయలు