సమస్యాపూరణం -contd

గణములుఁగల పద్యపు,తో
రణములెఁగద పండితులకు రమ్య క్రీడల్--
ఫణి ఫణ రంజిత విలస 
న్మణులై చెలువొందు వారి మహితోక్తు లిలన్.


తోడయి రాగ నిర్ధనపు, దుఃఖ,విరాగ,నిరాశ,నీడలున్ 
మాడిన నిండు జీవితము మాయని వేదనయే మిగల్చగా
జాడలు కానరాని,వినజాలని,బాధల కృంగిపోవగా  
వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁదీర్చగన్.

మోడులువారు జీవిత తమోమయ గాధలు పోల్చి చెప్పగా 
వాడిన పూవులే తగును-భామలకున్  బ్రతుకమ్మఁదీర్చగన్
పాడగ పాటలన్,బ్రతుకు పండగ,నా తెలగాణ వీధులున్ 
వీడని దివ్య కాంతుల,సుభిక్ష,సురక్ష,ల తేలియాడవే!

అంకిత భక్తి భావ సముదంచిత వీర్య పరాక్రమోద్ధతిన్  
అంకుర గర్వ దివ్య  మహితాద్భుత శౌర్య విజృంభితాత్ముడై  
పెంకె తనాన శైవు డతి భీకర రావముతోడ సర్వ నా
శంకరుడెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందగన్.


సంకట దైత్యులన్ దునుమ చయ్యన శూలము నేమిఁజేసెనో?
వంకలు లేని యోగిజన వంద్యులు,తాపసు లెందునుందురో?
శంకలు వీడి దైత్య గణసంఘము పోరుకు రాగ నేమయెన్?
శంకరుడెత్తె--మంచు మల--శైలజ భీతిలి కంపమొందగన్.

తీరని మోజుతో తమకు దివ్య సుమంగళ భాగ్య మొచ్చెనం  
చా రతి మన్మధుల్ దలచె-నట్టి శుభప్రద కార్యమందునన్  
తోరణ,మంగళాక్షతలతోడుత పెద్దలు సంతసించి  శ్రీ   
కారముఁబెట్టి బంధువుల కన్నులు చల్లగ జేసిరెంతయున్.

దారినఁబోవు నెల్లర కుదారత,వారలు,గౌరవాదులన్  
నేరుపు మీరఁజూపుచును,నిర్మల భావ సమాదరంబులన్  
కూరిమిఁదాల్చుచున్,సుజన కోటికి,మేటిగ,నిండుగా,నమ  
స్కారముఁబెట్టి,బంధువుల కన్నుల చల్లగఁజేసిరెంతయున్

సాధిత ధర్మ మార్గపు విశాల రసార్ద్ర మనోభిరాముడై,
క్రోధ విదూరుడై,వసుధకున్ ప్రియ పుత్రిక యైన సీత నా
రాధన భావమేర్పడ,పరాక్రమ శాలియు,రాగయోగ్యతా
రాధను,పెండ్లి యాడె రఘురాముఁడు దేవతలెల్ల మెచ్చగన్.


మాధవుడేమొవర్చె తలమానికమౌ ప్రియ భామినీమణిన్?  
క్రోధముఁబూని తాపసులకున్ వెఱపున్గలిగించుచు సాధ్వి సీతకై  
వ్యధలనుఁగొన్న రావణు కృపా మతిఁగూల్చెనదెవ్వరెట్టులో?  
రాధను పెండ్లి యాడె-రఘురాముడు-దేవతలెల్ల మెచ్చగన్.

Comments

Popular posts from this blog

శ్రీకృష్ణదేవరాయలు